2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.

తెలుగు నిలుపుటపై జరిగిన చర్చ

ఈ-తెలుగు నుండి

ఈ పేజీలోని విషయం ప్రస్తుతం కొనసాగుతున్న చర్చకు సంబంధించినది. రాబోయే రోజుల్లో ఇది మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది

e-తెలుగు సైటులో తెలుగు నిలుపుట అనే విషయమై చర్చ జరిగింది. ఆ చర్చ సారాంశం ఈ పేజీలో రాస్తున్నాం.

  1. మనం తెలుగుతో ఏం సాధించాలనుకున్నామో తెలిస్తే అది స్పష్టంగా తెలియజేయవచ్చు. ఈ తెలుగోళ్లకి తెలుగును ఒక సాంస్కృతిక ప్రతీకగా, ఒక ఫ్యాషన్గా, ఒక గర్వకారణమైన విషయంగా మార్కెట్ చేసేదెట్టా తిరుమలేశా???? ఇంతకీ అసలు ప్రశ్న తెలుగెందుకు? దీనికి ఖరాఖండిగా జవాబు చెప్పలేనంత వరకూ మనం (అంతర్జాలంలోని తెలుగు నెజ్జనులు) మెడ తెగిన కోళ్ళమే!!
  2. నా అభిప్రాయం ప్రకారం,మనకు అందుబాటులో ఉన్న సమాచారంతో సరిపెట్టక అసలుసిసలు అధికారికమైన సమాధానం/వివరణ మనకు కావాలి తెలుగుభాషా వినియోగంపై.సమాచార హక్కు చట్టం ప్రకారం రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శిని ఉద్దేశించి ఒక దరఖాస్తును e-తెలుగు తరపున దాఖలు చెయ్యాలి. తద్వారా వారు మనం తదుపరి చేపట్టే చర్యలకు అంగీకరించటమో/తిరస్కరించటమో అధికారికంగానే తెలుస్తుంది.
  3. ఈలోపు ఆన్ లైన్ పిటీషన్ ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారి, తెలుగుభాషాభిమానుల నుంచి సంతకాలు సేకరించటం జరుగుతూ ఉండాలి అన్నవి ఇప్పటికిప్పుడు నేను సూచించగలిగినవి.
  4. మనకు చాలా ఉత్సాహం ఉంది, కోరిక ఉంది, కానీ అదే సమయంలో మన లిమిటేషన్లు కూడా తెలుసుకోవాలి. మనకు ఉన్న అంగ బలం చాలా తక్కువ, అధికార బలం లేదు, అర్ధ బలం కూడా చాలా తక్కువ. సమయం కూడా తక్కువ. కనుక మనం చిన్న చిన్న పనులు, ప్రభావశీలమైనవీ తీసుకొని భవిష్యత్తు తరాలకు తెలుగును సగర్వంగా అందించే యత్నం చేస్తే ఎలా ఉంటుంది.. ఉదాహరణకు
    1. తెలుగు ఝండా ఉరూరా ఎగరవేసే కార్యక్రమాలు
    2. ఈ తెలుగు తరపున బడుల్లో అధ్బుతమైన గ్రంథాలయాలను నిర్వహించడం.
    3. తెలుక్కి సంబందించి ఐటీ ప్రాజెక్టులను స్పాన్సర్ చెయ్యటం.
  5. e-తెలుగు సంఘం అన్ని ( వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజావసరాలు, దుకాణాలు ) మాద్యమాలలో గళం వినిపించేబదులు, ఒక వేదిక ( అంతర్జాలం, ఐటీ) లోనో ఘట్టిగా తన గర్జిస్తే ఆ గర్జన అందరికీ వినిపిస్తుందని నా నమ్మకం. మనం తెలుగుకు తోడ్పడు వివిధ గుంపులు ( బ్లాగులు, వికీ, తెలుగు లైనెక్సు మొ..) అందరిని ఒక చోట సమావేశపరిచి గర్జిదాం ..ఆ గర్జనకు మీడియా, ప్రైవేటు, ప్రభుత్వ ముఖ్యులను అహ్వానిద్దాం, వేదిక కొరకు మన తెలుగు విశ్వవిద్యాలయాన్ని కోరదాం )
  6. ఎన్నికలు రాబోతున్నాయి. పోటీ చేసే ప్రతీ అభ్యర్థికీ తెలుగు ఎలా వెనకబడిపోతోందో చెబుతూ ఉత్తరాలు రాయాలి. ప్రభుత్వం ఏర్పడ్డాక, తెలుగును నిలిపేందుకు తగు చర్యలు తీసుకుంటామని వాళ్ళచేత చెప్పించాలి. తమ ప్రసంగాల్లో తెలుగును నిలబెట్టడం పట్ల తమ నిబద్ధతను తెలుపమని కోరుదాం. వాళ్ళేమైనా చెయ్యగలరా లేదా అనేది పక్కన పడదాం.. ఫలానా విషయం కూడా ఒక ఎన్నికల అంశమే అనే సంగతిని వాళ్ళ మెదళ్ళలోకి ఎక్కించేవరకైనా సాధించవచ్చు.
  7. రాబోయే ఎన్నికలకు సన్నాహకాలే ఇప్పుడు జరుగుతున్న గర్జనలు, పర్యటనలు, ప్రచారాలూను. జనాల్లో తిరుగుతున్న ఈ రాజకీయుల దృష్టిని కూడా కాస్త ఈ అంశం మీద పడేలా చెయ్యాలి. ఒకళ్ళిద్దరు ఈ అంశం గురించి మాట్టాడుతుంటే మిగతావాళ్ళు కూడా అనుసరిస్తారు
  8. ఒక ప్రణాళిక ప్రకారం వీలైనన్ని ప్రచారమాధ్యమాల ద్వారా తెలుగు భాష మాట్లాడడం గురించిన అపోహలని తొలగిస్తూ, తెలుగు భాషమీద అభిమానం పెంచేలా ఊదరగొట్టడమే. ముఖ్యంగా టార్గెట్ చెయ్యాల్సిన వర్గం నగరాల్లో చదువుకున్న మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ధనవంతుల వర్గాలు. ఈ ప్రచారానికి భారతదేశంలో (ముఖ్యంగా ఆంధ్రాలో) ఉన్నవాళ్ళు ఒక ఇరవై ముప్ఫైమంది దాకా కలిస్తే మంచిది.
  9. మనకు దగ్గరున్న స్కూళ్ళల్లో పిల్లల్ని telugulO racanalu cEsElaa ప్రోత్సహిస్తే వాళ్ళల్లో తెలుగు ఇంకా తెలుసుకుని, ఇంకా బాగా రాయాలన్న కసి పెరుగుతుంది. ఒక్కో స్కూలుకి బాగా రాసే పిల్లలు ఒకరిద్దరున్నా ఈ ప్లాను పండినట్టే! మన విత్తు మొలకెత్తినట్టే!! వాళ్ళు రాసినవాటిల్లో మంచి మంచివి కొన్ని పత్రికల్లోనో, టీవీ చానల్లలో వచ్చే వినోద కార్యక్రమాల్లోనో వేయించగలిగితే మరింత ఉత్సాహాన్నిస్తుంది. అక్కడ, వాళ్ళు ఏదో సహాయం కోసం తీగలు వెదికే సమయానికి, వాళ్ళకు దొరకాల్సిన తెలుగు సాహిత్యాన్ని అందించగలిగామో, తెలుగు భాష పంట పండినట్టే. పుస్తకాలు చదవరన్న అనుమానం వద్దండి. ఎందుకంటారా, ఇదో అంటు వ్యాది లాంటిది.
  10. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ ప్రజలకి ఎక్కువ ఉపయోగించే ఒక కార్యాలయాన్ని ఎన్నుకోండి. ఉదాహరణకి ట్రాన్స్పోర్ట్ ఆఫీసు అనుకుందాము. అక్కడ ఉండే దరఖాస్తు ఫారాలు అన్నీ నమూనాలు సంపాదించి తెలుగులో తర్జుమా చెయ్యండి. అలాగే అక్కడ ప్రజలు వేచి ఉండే ప్రదేశాన్ని బాగా పరిశీలించి ఎన్ని సూచనలు తెలుగులో ఉన్నాయో గమనించండి. వాటిని కూడా తెలుగులో తర్జుమా చేసి, ఈ రెండిట్తోనూ ఆ కార్యాలయపు అత్యున్నత అధికారిని కలిసి మెమొరాండం ఇవ్వండి. వీటిని తెలుగులో అమలు చెయ్యాలి అని. ఇదైనాక ఇంకో కార్యాలయం. మంత్రులు పోర్టుఫోలియోలు తీసుకున్నట్టుగా సభ్యులు ఒక్కొక్క ఆఫీసు గుత్తకి తీసుకుని ఆ వత్తిడిని సమతుల్యంగా చూసుకుంటూ ఉండాలి.
  11. ఇలాగే పెద్ద పెద్ద స్టోర్ల లో కూడా. కానీ ఇదెంత సమర్ధవంతంగా జరుగుతుందో నాకు అనుమానమే.
  12. వ్యక్తిగతంగా అందరమూ ప్రతిజ్ఞ చేసుకోవాలి. అవతలి వ్యక్తికి ఏమాత్రం తెలుగు వచ్చినా, సంభాషణ తెలుగులోనే చేస్తామని, మన దైనందిన కార్యక్రమాలన్నిటిలోనూ. ముఖ్యంగా పిల్లలతో (ఏ వయసు వారైనా) మాట్లాడేటప్పుడు.
  13. బేంకులో ఉపయోగించే వివిధ ఫారాలకీ, అలాగే ప్రభుత్వ కార్యాలయాల ఫారాలకీ, దరఖాస్తులకీ తెలుగు నమూనాలు తయారు చేసి మన గూట్లో ఉంచాలి, జనాలు ప్రింటు తీసుకో గలిగేట్టు. అలాగే, ఇంకా కొన్ని మూస దరఖాస్తులు, అర్జీలు కూడా రాసి వాటి నమూనాలు ఉంచాలి.
  14. యువతని ఆకట్టుకోవాలని గోపాల్ చేసిన సూచన బాగానే ఉంది నాకు ఒకటి అనిపిస్తోంది. తెలుగు మాట్లాడ్డం, రాయడం కూడా స్టైలిష్ అనే భావన కలిగించాలి, స్కూల్లోనూ కాలేజిలోనూ. అదెలాగో ఆలోచిస్తే బాగుంటుంది.
  15. నా ఉద్దేశంలో తెలుగువాళ్ళు తెలుగుభాషని తక్కువగా చూడ్డానికి మూల కారాణాలు మూడు:
    1. ఇంగ్లీషు మాట్లాడడం (తెలుగు మాట్లాడకపోవడం) నాగరిక లక్షణం అనే భావన: దీన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే, ప్రచారసాధనాల సహాయం తప్పదు. ఆ మధ్య అధికారభాషాసంఘమూ, తెలుగు దూరదర్శనూ సంయుక్తంగా టీవీ ఏంకర్లకి తెలుగుభాష మీద ఒక వర్క్ షాపు నిర్వహించారట! అదెంతవరకూ సఫలమయిందో తెలీదు. బహుశా అధికారభాషాసంఘం అదో మొక్కుబడిగానే కానిచ్చిందేమో. బాలసుబ్రహ్మణ్యం లాంటి పెద్దవాళ్ళనే కాకుండా, తెలుగుపై అభిమానం ఉన్న ఈ తరం ప్రఖ్యాత వ్యక్తులని పట్టుకొని, వాళ్ళ ద్వారా తెలుగుభాష మాట్లాడకపోవడం నాగరికత కాదని ప్రచారం చెయ్యాలి. టీవీ చానళ్ళలో స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేలా వత్తిడి తేవాలి.
    2. ఇంగ్లీషు నేర్చుకోడానికి తెలుగుని విస్మరించాలి అనే నమ్మకం: ఈ సమస్యని పరిష్కరించడానికి స్కూళ్ళని ఆశ్రయించవచ్చు. టీచర్ల ద్వారా తల్లిదండ్రులకి ఈ విషయాన్ని తెలియజేస్తే ఎక్కువ ప్రభావం ఉంటుంది.
    3. తెలుగు లేకపోయినా పని జరిగిపోతుందిలే అన్న ధైర్యం: దీన్ని ఎదుర్కోడానికి కొత్తపాళీ గారి సూచన ఉపయోగపడుతుంది.
  16. తెలుగు మాట్లాడడం అనేది తక్కువతనం కాదు అనే భావన పిల్లల్లో .. ముఖ్యంగా యువతలో కలిగించగలిగితే అది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంగ్లీషు మాట్లాడడానికి తెలుగు విస్మరించాలి అనేకన్నా, మన మాతృభాషలో బాగా పట్టు ఉంటే మరొక భాష బాగా నేర్చుకోగలమన్న భావన అందరిలో మనం కలిగించాలి. ఇప్పుడు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు చాలా మంది తెలుగు మాధ్యమంలో చదువుకున్నవారే. ఆ విషయాన్ని మనం బాగా అందరి దృష్టికీ తీసుకెళ్ళాలి. మా నాన్నగారు / తాతగారి తరంలో కార్యాలయాల్లో మొత్తం ఇంగ్లీషులోనే తమ కార్యకలాపాలు సాగించినా, వారెవరూ తెలుగుని చిన్నచూపు చూడలేదు. వారిలాగా మంచి ఇంగ్లీషులో అన్ని రకాల పనులకూ ఈ తరం వారు ఇంగ్లీషులో ఉత్తర ప్రతుత్తరాలు సాగించలేరు.. కానీ ఇంగ్లీషు చదువుకోవడమే గొప్ప అనే భ్రమలో ఉన్నారు చాలామంది. ఆ భ్రమని మనం పోగొట్టగలిగితే చాలు. దానికి పాఠశాలలు, కళాశాలలు, ఎలక్ట్రానిక్ మీడియా (ఇంటర్నెట్, టీవీ, ఎఫ్.ఎం రేడియో)...అన్నిటినీ వేదికలు గా చేసుకోవాలి. మరొక ప్రయత్నం మా వంతుగా,
  17. మా కార్యాలయంలో "తెలుగు సాహితి" అనే పేరుతో తెలుగు సాహితీ సమావేశాలను ప్రతీ నెలా నిర్వహించబోతున్నాము. ఇలాటి ప్రయత్నాలు వేలకు వేలు తెలుగు వారు పనిచేసే కంపనీల్లో జరిగితే కొంత మన భాషా వ్యాప్తికి దోహదపడుతుందని - తెలుగు మాట్లాడడంలో, చదవడంలో, రాయడంలో మన భాషలో ఉన్న సౌందర్యాన్ని అందరూ ఆస్వాదిస్తే, తెలుగు భాష మీద మమకారం అందరికీ పెరుగుతుందని నా భావన.

కింది సూచనలు ముఖ్యంగా బ్లాగుల వ్యాప్తికి ఉద్దేశించినవి

  1. ఇప్పుడు మనం జరుపుకుంటున్న తెలుగు బ్లాగుల దినం గురించి వార్తా పత్రికలలో వచ్చేట్టు చూడటం. ప్రసార మాధ్యమాలలో పని చేస్తున్న మిత్రులు, ఈ దిశగా ప్రయత్నించ వచ్చు. సమావేశం జరిగిన చోట్ల మర్నాడు వార్తా పత్రికలలో ఇంకా వీలైతే స్థానిక కేబుల్ టీవీలలో ఆ విషయం ప్రముఖంగా ప్రస్తావించేందుకు ప్రయత్నిచండి. ప్రముఖ చానళ్ళు దృష్టిపెట్టేంత పెద్ద సమావేశం జరిగితే మరీ మంచిది.
  2. రెండొవది అంతర్జాల మాధ్యమం ద్వారా చేయదగిన పనులు -
    1. తెలుగు బ్లాగుల గురించి ఒక వేగు (ఈ మైల్) తయారుచేసి దాన్ని తెలిసిన తెలుగు వాళ్ళందరికి పంపించడం (చైన్ మైల్స్). దానికి కొస మెరుపు "మీకు తెలిసిన తెలుగు వారికి పంపించండి... అంతర్జాల తెలుగు వెలుగుకి తోడ్పడండి" అని రాస్తే మరింత మందిని చేరే అవకాశం వుంటుంది.
    2. తెలుగు బ్లాగుల అభివృద్దికి (బ్లాగుల సంఖ్య పెరగటానికి, చదువరుల సంఖ్య పెర్గటానికి) కొన్ని లింకులు తయారు చేసి ప్రతి బ్లాగరు తమ తమ బ్లాగుల్లో పెట్టుకోవడం. ఉదా: "మీరూ తెలుగులో బ్లాగు మొదలుపెట్టాలనుకుంటున్నారా?" లేక "ఇప్పుడు తెలుగులో బ్లాగు రాయటం చాలా సులభం.." అని ఒక లంకె పెట్టి లంకె నొక్కగానే తెలుగు బ్లాగులు మొదలుపెట్టడం ఎలాగో తెలిపే పేజీకి తీసుకు వెళ్ళటం లాంటివి.
    3. బ్లాగర్లు ఒకరికొకరు సహకరించుకొనే పద్దతి మరొకటి. వుదాహరణకి హాస్య బ్లాగులు రాసేవారు తమ బ్లాగులో - "ఈ బ్లాగు మీకు నచ్చిందా అయితే మరిన్ని హాస్యబ్లాగులు ఇవిగో - " అంటూ తోటి హాస్యబ్లాగర్ల లింకులు ఇవ్వటం
    4. బ్లాగు అగ్రిగేటర్లు సబ్‌స్క్రైబ్ లింకులు ఇవ్వటం. ఇక్కడ సబ్‌స్క్రైబు చేసిన వారికి నిర్ణీత కాల వ్యవధిలో బ్లాగులలో జరిగిన విషయాలు పంపించచ్చు. (పొద్దులో వచ్చే బ్లాగ్వీక్షణం లాంటివి)
  3. మూడొవది బ్లాగేతర మాధ్యమాలలో రచనలు చేసే రచయితలను బ్లాగుల్లోకి తీసుకు రావటం. దీనికి కొంచెం కష్టపడాలి.
    1. అంతర్జాల పత్రికలవారు ప్రముఖ రచయితలను కలిసి తమ పత్రికకి రాయమని అడగటం
    2. మనం జరుపుకొనే సమావేశాలకు ప్రముఖ రచయితలను అతిథులుగా పిలవటం.
    3. అంతర్జాల పత్రికలవారు కథల/కవితల పోటీలు నిర్వహించటం. (కౌముది-రచన కలిసి ఇప్పటికే ఒక కథల పోటీ పెట్టారు). ఇలాంటి పోటీలను ప్రముఖ (అచ్చు)పత్రికలలో ప్రముఖంగా ప్రకటించి ఆ ప్రకటనలోనే అంతర్జాల తెలుగు సాహిత్యంలో కొత్త మాధ్యమంగా ఎలా ఎదుగుతున్నది వివరించాలి. అచ్చులో పేరు చూసుకోవాలనుకునే ఎందరో వర్ధమాన రచయితలు తప్పకుండా ముందుకు వస్తారు.
  4. మనం అంతా సంఘటితంగా వున్నాం అని ప్రకటించుకోవటం. ఏదైనా ఒక లోగో తయారు చేసి అందరి బ్లాగులలో పెట్టుకోవటం, ఏదైనా పండగలప్పుడు, ప్రత్యేక సందర్భాలలో అందరం ఒకే రకమైన సందేశం పెట్టుకోవటం. ఉదా: ఏదైనా దుస్సంఘటన (ముంబై తీవ్రవాదం లాంటివి) జరిగినప్పుడు అందరి బ్లాగుల్లో నల్ల బాడ్జీ వుంటే ఎలా వుంటుంది? సంక్రాంతి రోజు అందరి బ్లాగులో చక్కని రంగవల్లి దాంతో పాటు శుభాకాంక్షలు వుంటే? ముంబై తీవ్రవాద చర్య జరిగినప్పుడు ఆంధ్రజ్యోతి వారనుకుంటా "దీని పై తెలుగు బ్లాగర్లు ఏమంటున్నారు" అని చూసారు. రేపు రాష్ట్ర ఎన్నికలప్పుడూ ఇలాంటి వార్త ఒకటొస్తుందని నా వూహ.
  5. చెన్నై, ముంబై, అహ్మదాబాదు, ఆనంద్, భోపాల్, ఇండోర్ -. ప్రతి చోట తెలుగు అసోసియేషన్/క్లబ్ వున్నాయి. ప్రతి చోటా తరచుగా కాకపోయినా కనిసం కార్తీక మాసంలోనో, సంక్రాంతికో, ఉగాదికో కలుస్తారు.
    1. ఇలాంటి సభల్లో బ్లాగర్లు సభ్యులై అక్కడ తెలుగు బ్లాగుల గురించి మాట్లాడటం. కుదిరితే లైవ్ డెమాన్‌స్ట్రేషన్ చెయ్యటం. లేదూ మీ బ్లాగులోనే మీకు నచ్చిన టపా ఒకటి తీసుకెళ్ళి చదవండి/కాపీలు పంచండి.
    2. ఒక పోస్టర్/కరపత్రం లాంటిది తయారు చేసిపెడితే అది ఇలాటి సభలలో బ్లాగర్లు వాడుకోవచ్చు.
పేజీకి సంభందించిన లింకులు